దేశవ్యాప్తంగా 19 రాష్ర్టాలు లాక్‌డౌన్ అయ్యాయని, 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని కేంద్ర వైద్యరోగ్వ శాఖ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా చైన్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నమని చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయించవద్దని నిర్దేశించారు. కరోనా పరీక్షల కిట్ తయారీ కోసం రెండు సంస్థలకు అనుమతి ఇచ్చాం. మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలన్నారు. కోవిడ్-19 బాధితుల కోసం ఆస్పత్రులను సిద్ధం చేయాలని రాష్ర్టాలను కోరుతున్నట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ చెప్పారు.
కరోనా పరీక్షల కేంద్రాలకు మార్గదర్శకాలు రూపొందించాం. దేశవ్యాప్తంగా 15000 కేంద్రాల్లో నమూనాలు సేకరిస్తున్నాం. ప్రైవేట్ సంస్థలకు కరోనా పరీక్షలు అనుమతిస్తే పరీక్షల రుసుం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ఉండాలన్నారు. ఇప్పటివరకు 415 కేసులు నమోదయ్యాయి. 23 మంది డిశ్చార్జయ్యారు. 7 మరణాలు చోటుచేసుకున్నాయని లవ్‌అగర్వాల్ తెలిపారు.