ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో చాలా రోజులుగా అగ్రస్థానంలో కొనసాగిన భారత సారథి విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి స్మిత్ టాప్ ర్యాంకు చేజిక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కేవలం 21 పరుగులు మాత్రమే చేయడంతో అతడు రేటింగ్స్ కోల్పోయాడు. 2015 జూన్‌లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచిన స్మిత్..టాప్ ర్యాంకు అందుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో స్మిత్, కోహ్లీ కాకుండా కివీస్ సారథి కేన్ విలియమ్సన్ మాత్రమే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఐతే కేన్ కేవలం 2015 డిసెంబర్‌లో కేవలం 8రోజులు మాత్రమే నంబర్‌వన్‌గా కొనసాగాడు. స్మిత్(911 రేటింగ్స్) అగ్రస్థానంలో నిలువగా విరాట్ కోహ్లీ(906) రెండు, విలియమ్సన్(853) మూడు ర్యాంకు కొనసాగుతున్నారు. భారత్ నుంచి రహానె ఎనిమిది, పుజారా తొమ్మిది, మయాంక్ అగర్వాల్ పది స్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల జాబితాలో పాట్ కమిన్స్ తొలి ర్యాంకును నిలబెట్టుకోగా.. భారత్ నుంచి స్పిన్నర్ అశ్విన్(9వ ర్యాంకు) మాత్రమే టాప్-10లో ఉన్నాడు.