మరణదండన విధించిన కేసుల్లో డెత్ వారంట్ జారీ తర్వాత ఏడురోజుల్లోగా శిక్ష అమలుచేసేలా మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఒక కేసులో ఒకరికన్నా ఎక్కువమందికి మరణశిక్ష పడితే.. ఇతర నేరస్థుల రివ్యూ /క్యురేటివ్ /క్షమాభిక్ష పిటిషన్లను కారణంగా చూపి శిక్ష అమలును వాయిదా వేయరాదని కోరింది. దోషుల హక్కుల కోణంలో కాకుండా.. బాధితుల కోణంలో ఆలోచించి తగిన మార్గదర్శకాలు జారీచేయాలని విన్నవించింది. నిర్భయ కేసులో మరణదండనకు గురైన నలుగురు దోషులు రివ్యూ, క్యురేటివ్ పిటిషన్లు దాఖలుచేస్తూ, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ కాలయాపన చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం పిటిషన్ దాఖలుచేసింది. ఇందులో ప్రధానంగా మూడు విజ్ఞప్తులు చేసింది. ‘కోర్టు రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన తర్వాత దోషులు క్యురేటివ్ పిటిషన్ దాఖలుకు నిర్దిష్ట గడువు విధించాలి. క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైతే.. ఆ తర్వాత ఏడురోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలుచేసేలా ఆదేశించాలి. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరిస్తే.. ఏడురోజుల వ్యవధిలో తప్పనిసరిగా డెత్ వారంట్ జారీచేసేలా సంబంధిత కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులకు ఆదేశాలివ్వాలి. ఆ తర్వాత ఏడురోజులలోపు శిక్షను అమలుచేసేలా మార్గదర్శకాలు విడుదలచేయాలి’ అని కేంద్రం విజ్ఞప్తిచేసింది. ఒక కేసులో ఒకరికన్నా ఎక్కువమందికి మరణశిక్ష పడితే.. ఇతర నేరస్థుల రివ్యూ /క్యురేటివ్ /క్షమాభిక్ష పిటిషన్లను కారణంగా చూపి శిక్ష అమలును వాయిదావేయరాదని కోరింది.