వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతర. ఇంకో వారం రోజులే గడువు. నట్టనడివి అడవిలో దట్టమైన జనారణ్యంగా రూపాంతరం చెందే అద్భుత సన్నివేశం ఆవిష్కృతం కాబోతున్నది. చూడ కన్నులు చాలని తల్లుల జాతర. ఆదిమ గిరిజన సంస్కృతి నుంచి ఆధునిక సాంకేతికల మేళవింపుదాకా అనేకానేక అజరామర ఘట్టాలను మేడారం తన అమ్ముల పొదిలో దాచుకుంటూ కోటానుకోట్ల భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మహాజాతర. మేడారం టర్న్స్ ఫ్రం బుల్లక్ కార్ట్ టు సైబర్ మార్ట్. ఎడ్లబడ్ల మీద నుంచి హెలిక్యాప్టర్ సేవల్ని తమ గద్దెల వద్దకు రప్పించుకునే అపురూప ఘట్టానికి సరిగ్గా వారం రోజులే ఉన్నది. బుధవారం మండమెలిగె పండుగతో జాతరకు అంకుర్పాణ జరుగుతున్నది. దేశ విదేశాల నుంచి భక్తులు మేడారం సమ్మక్క-సారమ్మలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెలంగాణ ధిక్కార సంస్కృతికి ఆలవాలమైన సమ్మక్క-సారమ్మల ఆత్మగౌరవ ప్రతీకలకు నిలువెత్తు సంతకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఆవిర్భావం దాకా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి పథాన రాష్ర్టాన్ని పరుగులు పెట్టించే క్రమంలో ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను దిగంతాలకు చాటేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లీబిడ్డలిద్దరూ గద్దెల మీద కొలువుదీరి భక్తులకు దీవెనలిచ్చే రోజు (వచ్చేనెల 7న, శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం రాబోతున్నారు.